mee ishtam. enthaina sampaadinchandi

massiveptr.com

Saturday, 15 October 2011

మా కాలేజ్ కి నేను ఎలా వెళ్ళాలి? దేవుడే దారి చూపాడు

ఒకప్పుడు నాకు మొహమాటం చాల ఎక్కువ. ఇప్పుడు కాస్త తగ్గింది కాని పూర్తిగా కాదు. ఒక రకంగా నన్ను  అందరూ ఉపయోగించుకుంటారు. నాకు అర్థం అవుతుంది కాని   " ఎదుటివాళ్ళను వీలైనంత క్షమించడం నా బలహీనత."
"పని చేయలేను", "చేయను"," తర్వాత  చేస్తాను"  అని చెప్పడానికి నేను ఇబ్బంది పడతాను.   సరే ఇదంతా ఎందుకంటే  మొహమాటం,  బెరుకు వల్లే నేను, మా అక్క, మా నాన్న  చదువుకున్న మా వూరి డిగ్రీ కాలేజ్ కి  10 yrs  వరకు వెళ్ళలేక పోయాను.

 నా డిగ్రీ ఐపోయాక పెళ్లి, సంసారం . రోజులు గడుస్తున్నై. నేను చదువుకున్న కాలేజ్ కి వెళ్లి ఆ రూం లు అన్ని ఒకసారి చూడాలి అనుకొనేదాన్ని. కాని ధైర్యం చేయలేక పోయాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ వుండరు. ఎవరిపనిలో వాళ్ళు వుంటారు. ఇతరులు రావొద్దు అని అంటారేమో అని భయం.  కాని ఎలా ఎలా ఎలా వెళ్ళాలి.  నాకు తోడు ఎవరూ లేరు. క్లాస్మేట్స్ అంతా ఎక్కడో సెటిల్ అయ్యారు. జ్ఞ్యాపకాలు క్లాస్మేట్స్ తో పంచుకుంటేనే బాగుంటాయి. 

ఒకరోజు సండే పేపర్ లో అదే  కాలేజ్ కి కంపూటర్ నాలెడ్జ్ వున్న ఆడవారు కావలెను(టెంపరరీ)  అని వచ్చింది. టైం కరక్ట్ గా 9 .00 a .m అయ్యింది. ఫోన్ చేసాను. 9 .30 a .m రమ్మన్నారు. గబా గబా తయారయ్యాను. ఆటో తీసుకొని సర్టిఫికెట్స్  జీరాక్స్  తీయించుకొని వెళ్ళాను. పిన్ చేయలేదు వాటికి. నా దగ్గర వున్న పిన్నీస్ పెట్టాను. ఎలాగో అనిపించింది. కాని పని జరగాలి కదా. అది ముఖ్యం.  

కరక్ట్ గా 9 .30 a .m అయ్యింది. నాకంటే ముందు ఇంకా 10 మంది వున్నారు. వాళ్ళు కొత్తగా డిగ్రీ చదివారేమో యంగ్ గా వున్నారు. నేనేమో 8 yrs పెద్ద. గోవిందా అనుకుంటున్నాను. జాబ్ పేరుతో నా కాలేజ్ కి వచ్చాను చాలు అనుకొని కాలేజ్ మొత్తం తిరిగాను మెల్లగా. మా నాన్న చదువుకొనే రోజుల్లో  పాడే  "శిలలపై శిల్పాలు చెక్కినారు" అనే పాట  నా చెవుల్లో మోగుతుంది. (నేను చూడలేదు మా నాన్న చెప్పారు). మా అక్క  పాడిన"ఇది మల్లెల వేళయనీ" పాట, నేను డి.జి.పి. ఎ.కే.ఖాన్ గారితో ఫస్ట్ ప్రైజ్ అందుకున్న " ఆకులో ఆకునై " పాటలు కూడా. గాలిలో తేలినంత ఆనందం.  చెప్పలేను.

ఇంటర్వ్యు నా వంతు వచ్చింది.  అన్నీ అడిగారు. జీరాక్స్ పేపర్స్ చూసారు. మరీ పిన్నీసు కూడాను .  నవ్వి "పిన్ పంచ్   లేదట సర్ షాపులో"  అన్నాను. తను కూడా నవ్వి ఊరుకున్నారు. మెమో చూసారు. "ఈ కాలేజ్ లోనే చదివావా అమ్మా?" అన్నారు. "అవును సర్" అన్నాను. సంతోష పడ్డారు. అక్కడే నాకు తెలిసిన ఇద్దరు లెక్చెరర్స్  ను విష్ చేసాను. నా రైటింగ్ చూసారు. లెటర్ వ్రాయమన్నారు. ఇంకా చాల అడిగారు.  ఫోన్ చేస్తామన్నారు. ౩ డేస్ కు ఫోన్ చేసారు.

అప్పటికే నేను 2  ఆఫీస్ లలో చేయడం,  మహిళను కావడం,  అదే కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవడం,  ప్రిన్సిపాల్ కు  లెటర్ చాల బాగా వ్రాయడం, నా రైటింగ్, నా ఎలిజిబిలిటీస్ అన్నీ చూసారు. వచ్చిన అందరూ నాకంటే చదువులో ఎక్కువే వున్నారు. కాని ఎంట్రెన్స్ లని, పెళ్ళిళ్ళు అని మధ్యలో వెళ్తారు అని తీసుకోలేదు.  ఇంకొక ముఖ్య విషయం  ఏంటంటే ఎవ్వరికీ  కూడా తెలుగు లో లెటర్ పధ్ధతి గా వ్రాయడం తెలీక పోవడం పెద్ద ఆశ్చర్యం. పోనీ ఇంగ్లీష్ లో కూడా వ్రాయలేక పోయారు.

నేను సెలెక్ట్ అయ్యాను. నన్ను ఉదయం 8 గంటల నుండి రమ్మన్నారు. హమ్మో  నా వంట, నా పిల్లలు, ఇంట్లో పనులు, మా వారు నా  కళ్ళముందు మెదిలారు. అంత తొందరగా నేను రాను సర్ అన్నాను. 9 .30 a .m . నుండి వస్తాను అన్నాను. చాల బతిమిలాడారు. సరే అని ఒప్పుకున్నాను. అలా 4 ఇయర్స్ చేసాను. ప్రతిరోజూ కొత్తే. ఒక్కనాడు కూడా సెలవు పెట్టలేదు. ఇష్టమైన పని. ఇష్టమైన కాలేజ్. ఇంకేముంది.  స్టూడెంట్స్ నాతో మంచిగా బిహేవ్  చేసేవారు. లెక్చరర్స్ తో సమానమైన మర్యాదలు. స్టూడెంట్స్ పార్టీలు, ఇదే సమయమని నేను కూడా నా పాటల యుద్ధం మొదలు పెట్టాను.(పాటలంటే నాకు చాల ఇష్టమని  బ్లాగ్ లలో రాసాను.)

"దేవుడా నా కోరిక తీర్చావు స్వామీ" అనుకోని సందర్భం లేదు. దేవుడు దారి ఎలా చూపెట్టాడు అని నాకు ఎంతో ఆశ్చర్యంగా వుంటుంది.  జాబ్ చేస్తూనే టైపింగ్ తెలుగు, హిందీ, టాలీ  నేర్చుకున్నాను. ఇంగ్లీష్ ముందే వచ్చు చాలా ఫాస్ట్ గా చేస్తాను.

(పండ్లువున్నచెట్టుకే రాళ్లు అన్నారుగా. నాకు పని భారం ఎక్కువవ్వడం వల్ల, మొహమాటం వల్ల , "నో" అని  చెప్పకపోవడం వల్ల,  సాలరీ పెంచకపోవడం వల్ల అలసి పోయి జాబ్ వదిలేసాను. )
 

Tuesday, 19 July 2011

నా రెండు ( సమీర, నందన ) బ్లాగ్ లు ఆపేస్తున్నాను.

నా రెండు   (  సమీర, నందన ) బ్లాగ్ లు  ఆపేస్తున్నాను.
ఎందుకంటే  అందరి బ్లాగ్ లు చూస్తుంటే నేనెంత అజ్ఞ్యానురాలినో తెలుసుకున్నాను.  నేను రాయడం అనవసరం. టైం వేస్ట్. దాని  బదులు చాల మంది రాసే బ్లాగ్ లను చదివితే కాస్త మెదడుకు పదును ainaa    వస్తుంది.
బ్లాగ్ లు చదవడం వల్ల నాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నై.  నేను రాసి మిమ్మల్ని చంపే బదులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లోనే నాకు ఆనందం. మహాను భావులు ఎందఱో అందరికీ నా మనఃపూర్వక వందనాలు.  ఎంత మంచి రచనలు బాబోయ్.         
  ఓ  దేవుడా కాస్త వారివి చదవడం వాళ్ళ నాకు జ్ఞ్యానాన్ని ప్రసాదించు స్వామి.
కాబట్టి ఇదే నా చివరి బ్లాగ్ రచన(అదే అంటారా?).     కానీ నేను వ్యాఖ్యలు చేయడం  మాత్రం మానను.      నా గురించి చెప్పేంత గొప్పదాన్ని  కాను.  నా గురించి ఆలోచిస్తే  నాకే నవ్వొస్తుంది. బావిలో కప్పను అని అర్థం ఐంది.    By.

Monday, 18 July 2011

@@@@@@@@@@@@@ ఐ కాన్ ఐ కాన్ ఐ కాన్ ఐ కాన్

ఐ  కాన్   ఐ  కాన్  ఐ  కాన్  ఐ  కాన్ అనుకోవడం నాకు చాల ఇష్టం. దాన్ని ఎల్లవేళలా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటాను. అలా అనుకొని  పనులు చేసుకోవడం  మా వారికి చాల తీరకను కల్గించింది.  నాకు ఆత్మవిశ్వాసాన్ని, కాస్త నష్టాన్ని కూడా కల్గిస్తుంది.
"జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బాధ్యతా యుతంగా వుండడం నాకు ఇష్టం. "

ఎలా అంటే చిన్నప్పటినుండి నాకు మాత్స్ అంటే పిచ్చి ఇష్టం. నా ఇంటరెస్ట్ ను గమనించి మా గురువులు నన్ను ఇంజినీర్ చేయమని చెప్పేవారు. కానీ  బి.పి.సి  తీసుకోవడం తో రాంగ్ రూట్ ఐపోయింది.

కానీ నా మెకానిజం  ను ఇంట్లో ఉపయోగిస్తుంటాను అప్పుడప్పుడు.  ఇంట్లో వుండే ప్రతి ఆడవారు ఇలా చేసుకోవడం తప్పనిసరి. మెదడుకు పదును, ఖర్చులు మిగులుతాయి.   చిన్నపనికి మెకానిక్ ను పిలవాలంటే వాళ్ళు  టైం  కి రారు, మరియు వారి ఇష్టం వచ్చినట్లు డబ్బులు అడుగుతారు.

గ్యాస్ స్టవ్ చెడిపోతే నేనే బాగు చేసుకుంటాను పూర్తిగా.

గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం కూడా చాలామంది చేసుకోరు. (అనుకుంటాను.)

fuse  పొతే ఎవ్వరినీ పిలవను. నేనే చేసుకుంటాను. మెయిన్ ఆఫ్ చేస్తాను. వైర్ చుట్టేసి సాకెట్ లో పెట్టేస్తాను.

గ్రైండర్ చెడిపోతే బాగు చేసుకుంటాను.  (పెద్ద ఎత్తున ఐతే షాప్ కే)

రైస్ కుకర్ కూడానూ.

ఇంట్లో నల్లాలు లీక్ అవుతుంటే పాతవి తీసేసి. కొత్త వాచర్ మరియు కొత్త టాప్ లు కూడా బిగిన్చేస్తాను.

వాల్ క్లాక్స్ బాగుచేస్తుంటాను.
 
ఫాన్స్, హీటర్, బల్బ్ కనెక్షన్స్  చేస్తుంటాను.   

ఇక బయటి పనులు కూడా ఎన్ని ఉంటాయో  మీకు తెలుసు కదా అవన్నీ ఒక్కదాన్ని చేసుకుంటాను. (చాలామంది చేసుకుంటారు లెండి అంటారేమో)

బాడ్మింటన్, కారంస్ బాగా ఆడతాను. ఎప్పుడు కూడా చాల ఉత్సాహంగా ఉండడానికి ప్రత్నిస్తుంటాను.

చాల కష్టమైనా పనిని చిన్నగా ఎలా చేయవచ్చో ఆలోచిస్తూ ఉండి, ఆ విధంగా చేస్తాను.

కుట్టు మిషిన్ కొత్తగా వచ్చినప్పుడు దాన్ని నేనే 10 వ  తరగతిలో బిగించాను.

మా వారి ప్యాంటు జేబులు చినిగి పోతూ వుంటే  వాటిని మంచి దట్టమైన కాటన్  క్లోత్ తో మళ్ళీ కుట్టేస్తాను.
బటన్స్, కాజాలు ఇవన్నీ మామూలే.

వంటింట్లో నల్ల ఒక మూలకు స్టవ్ ఇంకొక మూలకు వుంటై కదా.    అప్పుడు నల్ల నుండి స్టవ్ దాక ఒక పైప్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ ను కడుగోతూ ఎప్పుడు కూడా నీట్  గ ఉంచుకోవచ్చు.

నల్ల సంపులో నీళ్ళు చాలా ఉండి పొతే  దాని లోని పైప్ బయటికి తీయకపోతే నీళ్లన్నీ లాగేసుకుంటాయి కదా.  ఆ పైప్ చివరికి ఒక తర్మకోల్ ని కట్టేస్తే అది పైకి తేలుతుంది. అప్పుడు సంపులోని నీళ్ళు ఇంకిపోవు. నీళ్ళు ఎక్కువ కావాలి అంటే మాత్రం దాని కిందికి వేసి గమనించాల్సిందే నండి.

అందరికీ మీకు సహాయంగా నేనున్నాను అనేటట్టు ఉండడానికి ప్రయత్నిస్తుంటాను. ( చేయగలవి మాత్రమే )  మాట సహాయం కూడా కొందరికి ధైర్యాన్ని ఇస్తుందని నా అభిప్రాయం.

ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతాను. నేను రాలేదు అంటే నాకు ఏదో పని తగిలింది అని అందరికీ తెలుసు.  అందుకని ఎవరూ ఏమీ అనుకోరు.
మొబైల్ ను నాకు ఉపయోగంగా వాడుకుంటాను. అలారం, రిమైండర్, SMS లు తప్పకుండా పంపిస్తాను. ఈ రోజుల్లో ప్రయాణాలు తక్కువయ్యాయి కదా .
బర్త్ డే అందరివీ ఆ రోజుకి 5 సం దాకా రిమైండర్ లో ఉంచేస్తాను.
ఒక్క పూజలు, గుడి కెల్లడం  మరియు సాహిత్యం లో మాత్రం ఇంటరెస్ట్ కలగడం లేదు. 
గుడికి వెళ్తే మాత్రం మనస్ఫూర్తిగా  ఒక 1   గం. ఐన కూర్చుంటాను.

ఇక నాకు నష్టం ఏంటంటే  మా వారు ఆఫీస్  పనులతో బిజీ ఇపోవడం వలన అప్పట్లో పనులన్నీ ఆయనకు చెప్పకుండా చేసుకున్నాను. ఇప్పుడేమో నీకు అన్నీ వచ్చుకదా ఇంకా మెకానిక్ ఎందుకు అంటారు.   ఏమండీ ఏమండీ అని ప్రాధేయ పడకుండా చేసుకున్నాను. ఖర్మ.  ఏమీ పనులు చేయకుండా ఐపోయారు.  
మీరు మాత్రం అలా చేయకండి.  మగవారికి పనులు చెప్పడం కూడా చేయండి.

వుంటాను. మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి.  బై